Srimad Bhagavad Gita Chapter 2 Sankhya Yoga Verses 26 - 50 | శ్రీమద్భగవద్గీత సంఖ్య యోగము (శ్లోకాలు 25 - 50 )

 

Srimad-Bhagavad-Gita-Sankhya-Yoga-Verses-26-50

Srimad Bhagavad Gita: భారతం కేవలం చరిత్రాత్మకమైన ఒక కథ కాదు. దేవుడు జీవుడైన చరిత్ర. చేయరాని పనులు చేసి అగచాట్లు పడే జీవుని చరిత్ర. తాను సృజించు కొన్న విషమ వాతావరణం నుండి వెలువడడానికి వెతలుపడే చరిత్ర.


Srimad Bhagavad Gita Chapter 2 – Sankhya Yoga (Verses 26-50):


శ్లో || అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |       

       తథాపి త్వం మహాబాహో! నైవం శోచితు మర్హసి || 26 


తా || ఇక దీనిని నీవు నిత్యము పుట్టేది, నిత్యము గిట్టేదిగా భావించినా, మహాబాహుడా! అప్పుడు కూడా యిలా విచారించదగదు. 


శ్లో || జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |       

       తస్మా దపరిహార్యేఽర్థే న త్వం శోచితు మర్హసి || 27 


తా || పుట్టినవానికి మరణం ఖాయం. చనిపోయినవానికి జన్మఖాయం. అందుచేత నివారింపలేని విషయాలలో నీవు శోకింపరాదు. 


శ్లో || అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత! |       

       అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా || 28 


తా || అర్జునా! జీవుల మొదలెక్కడో తెలియదు. మధ్య మాత్రం అగపడుతుంది. చనిపోయాక ఏమీ తెలియదు. యిక విచారం దేనికి


శ్లో || ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం       

       ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |       

       ఆశ్చర్యవచ్చైన మన్యః శ‍ృణోతి      

       శ్రుత్వాఽ ప్యేనం వేద న చైవ కశ్చిత్ || 29 


తా || దీనిని ఒకానొకడు ఆశ్చర్యంగా చూస్తాడు. ఒకానొడకు ఆశ్చర్యంగా చెబుతాడు. ఒకానొడకు ఆశ్చర్యంగా వింటాడు. విన్నప్పటికీ ఎవరూ దీనిని తెలుసుకోలేరు. 


శ్లో || దేహీ నిత్యమవధ్యోఽయం దేహే సర్వస్య భారత! |        

       తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి || 30 


తా || అర్జునా! అన్ని దేహాలలో ఉండే దేహి నిత్యమైనది, చంపబడనిది అందుచేత ఎవర్ని గురించీ నీవు విచారించతగదు. 


శ్లో || స్వధర్మ మపి చావేక్ష్య న వికంపితు మర్హసి |        

       ధర్మ్యాద్ధి యుద్ధా చ్ఛ్రేయోఽన్యత్ క్షత్రియస్య న విద్యతే || 31 


తా || స్వధర్మం దృష్ట్యా చూచినా నీవు కంపించతగదు. క్షత్రియుడికి ధర్మయుద్ధం కన్నా మేలైనది లేదు. 


శ్లో || యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వార మపావృతమ్ |        

       సుఖినః క్షత్రియాః పార్థ! లభంతే యుద్ధ మీదృశమ్ || 32 


తా || అర్జునా! యాదృచ్ఛికంగా లభించినదీ, స్వర్గద్వారాన్నీ తెరిపించేదీ అయిన ఇలాంటి యుద్ధంలో పాల్గొనే అవకాశం అదృష్టవంతులైన క్షత్రియులే పొందుతారు. 


శ్లో || అథ చేత్త్వ మిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |       

       తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాప మవాప్స్యసి || 33 


తా || ఇక ఈ ధార్మికమైన యుద్ధాన్ని చెయ్యకపోయవో, దానివల్ల స్వధర్మాన్ని, కీర్తినీ వదలినవాడవై పాపం పొందుతావు. 


శ్లో || అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేఽవ్యయామ్ |        

       సంభావితస్య చాకీర్తిః మరణాదతి రిచ్యతే || 34 


తా || ఇంకా ప్రజలు నిన్ను గురించి అంతులేకుండా అప్రతిష్టాకరంగా మాట్లాడుతారు. మానవంతుడికి అకీర్తి మరణం కంటే బాధాకరం. 


శ్లో || భయాద్రణా దుపరతం మన్యంతే త్వాం మహారథాః |      

      యేషాంచ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవమ్ || 35 


తా || ఈ మహారథులందరు కూడా నీవు భయంవల్ల యుద్ధం నుండి పారిపోయావని అనుకుంటారు. వారు నీ వీరత్వాన్ని ఎంతో గౌరవించారు. ఇప్పుడు వాళ్ళకే నీవు చులకనై పోతావు. 


శ్లో || అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః |      

      నిందంత స్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ || 36 


తా || నీ శత్రువులు నిన్ను గురించి పలురకాలుగా అనరాని మాటలంటారు. నీ సమర్థతని నిందిస్తారు. అంతకన్న ఎక్కువ దుఃఖకరమైనది ఉంటుందా


శ్లో || హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ |       

       తస్మాదుత్తిష్ఠ కౌంతేయ! యుద్ధాయ కృతనిశ్చయః || 37 


తా || చనిపోయావా, స్వర్గాన్ని పొందుతావు. గెలిచావా, రాజ్యాన్ని భోగిస్తావు. అందుచేత కౌంతేయా! యుద్ధం చేయాలని నిశ్చయించుకొని లేచి నిలబడు. 


శ్లో ||  సుఖ దుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయౌ |        

        తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి || 38 


తా || సుఖదుఃఖాలనీ, లాభాలాభాలనీ, జయాపజయాలనీ సమం చేసి యుద్ధానికి సన్నద్ధుడివికా. ఈ విధంగా పాపం పొందకుండా వుంటావు. 


శ్లో || ఏషా తేఽభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు |       

       బుద్ధ్యా యుక్తో యయా పార్థ! కర్మబంధం ప్రహాస్యసి || 39 


తా || ఇంతవరకు నీకు జ్ఞానాన్ని బోధించడం జరిగింది. ఇక ఈ బుద్ధియోగాన్ని గురించి విను. పార్థుడా! ఈ బుద్ధితో కూడుకొంటే కర్మబంధాన్ని ఛేదిస్తావు. 


శ్లో ||  నేహాభిక్రమనాశోఽస్తి ప్రత్యవాయో న విద్యతే |        

        స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ || 40 


తా || ఈ కర్మయోగములో ప్రయత్నము నిష్ఫలం గావడం కానీ, విపరీత ఫలితాలు కలగడం గానీ ఉండవు. ఈ ధర్మం ఏ కొంచెం ఆచరించినా అది పెద్ద(సంసార) భయం నుండి రక్షిస్తుంది. 


శ్లో || వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన! |        

       బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ || 41 


తా || కురుకుమారా! ఇక్కడ నిర్ణయంతో కూడిన బుద్ధి ఏకాగ్రంగా ఒకే విధంగా వుంటుంది. నిశ్చయం లేనివారికి బుద్ధులు అనేక శాఖలుగా చీలి అసంఖ్యాకంగా వుంటాయి. 


శ్లో || యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః |        

       వేదవాదరతాః పార్థ! నాన్యదస్తీతి వాదినః || 42 


తా || అర్జునా! అజ్ఞానులూ (స్వర్గాది ఫలములను గూర్చి చెప్పే మాటలరహస్యం తెలియక) వేదవాక్యాల (శబ్దాల)లో ఆసక్తి వున్నవాళ్ళూ, (స్వర్గాదులకంటే) వేరేది (మోక్షం) లేదనే వాళ్ళూ, పువ్వుల్లాంటి మధురమైన ఈ (43 శ్లోకంలో) చెప్పబోయే మాటని చెప్తారు. 


శ్లో || కామాత్మాన స్స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదామ్ |       

       క్రియావిశేష బహులాం భోగైశ్వర్య గతిం ప్రతి || 43 


తా || కోరికలతో నిండినవాళ్ళూ, స్వర్గమే లక్ష్యంగా పెట్టుకున్నవాళ్ళు, జన్మలనూ, స్వర్గాదులనూ ఇచ్చేవీ, వాటిని సాధించే అనేక కర్మ విశేషాలతో నిండినవీ, భోగైశ్వర్యాలను కలిగించేవీ అయిన పువ్వుల్లాంటి మధుర వచనాలను చెప్తారు. 


శ్లో || భోగైశ్వర్య ప్రసక్తానాం తయాఽపహృత చేతసామ్ |        

       వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే || 44 


తా || భోగైశ్వర్యాలలో తగుల్కొని, ఆ (43 శ్లో) మధుర వాక్యాలకు లోబడి పోయిన వారికి ఏకాగ్రస్థితిలో నిశ్చయజ్ఞానం ఏర్పడదు. 


శ్లో || త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున! |        

       నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్ || 45 


తా || అర్జునా! వేదాలు త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందినవి. నీవు త్రిగుణాలకు అతీతుడవై, సుఖదుఃఖాది ద్వంద్వాలని వదిలి, నిత్యమూ, శుద్ధ సత్త్వంలో నిలిచి, యోగక్షేమాలని వర్ణించి, ఆత్మజ్ఞానివి కా. 


శ్లో || యావానర్థ ఉదపానే సరత స్సంప్లు తోదకే |       

       తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః || 46 


తా || అంతటా జలం పొంగిపొర్లుతున్నప్పుడు జలకలశాల ఉపయోగం ఎంతవరకో, అనుభవజ్ఞుడైన బ్రాహ్మణునికి అన్ని వేదాల ఉపయోగం అంతవరకే. 


శ్లో || కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |        

       మా కర్మఫల హేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి || 47 


తా || కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చేయడం మానుకోవాలి అని అనుకోవద్దు. 


శ్లో || యోగస్థః కురుకర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ! |        

       సిద్ధ్యసిద్ధ్యో స్సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే || 48


తా || ధనంజయా! యోగంలో నిలిచి, సంగం వదిలి, కర్మఫలితాలు సిద్దించడం, సిద్ధించకపోవడం ఈ రెంటినీ సమంగా భావించి కర్మలు చెయ్యి. ఆ సమత్వమే యోగమని చెప్పబడుతుంది.

 

శ్లో || దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ! |        

       బుద్ధౌ శరణ మన్విచ్ఛ కృపణాః ఫల హేతవః || 49 


తా || ధనంజయా! సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మ కంటే కామ్యకర్మ చాలా అల్పమైనది. కాబట్టి ఆ సమబుద్ధిని ఆశ్రయించు. కర్మఫలానికి కారకులయ్యే వారు పిసినిగొట్టులు. 


శ్లో || బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే |       

       తస్మాద్యోగాయ యజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ || 50 


తా || సమత్వబుద్ధితో కూడిన వ్యక్తి ఈ జన్మలోనే పుణ్యపాపాలని రెంటిని వదులుతాడు. అందుచేత నీవు యోగం కోసం ప్రయత్నించు. యోగమంటే కర్మలలో కౌశలమే.  


Previous                                                                              Next


Post a Comment

Previous Post Next Post