Srimad Bhagavad Gita Chapter 1 Arjuna Vishada Yoga Verses 1 - 13 | శ్రీమద్భగవద్గీత అర్జున విషాద యోగము (శ్లోకాలు 1 - 13)

 

Srimad-Bhagavad-Gita-Arjuna-Vishada-Yoga-Verses-1-13

Srimad Bhagavad Gita Chapter 1 – Arjuna Vishada Yoga (Verses 1-13) :


అథ ప్రథమోఽధ్యాయః

అర్జున విషాద యోగః

 

    Bhagavad Gita: మొదటి అధ్యాయం విషాదయోగం. విషాదం అంటే విష+ అదం = విషాన్ని తినేది. ప్రపంచంలోని అనుభవాలు చేదుగా తోచే సమయాలు అనేకం ఉంటాయి. అసమర్థతవల్ల, వైఫల్యం చెంది, భయం చేత, పిరికితనంతో, వైరాగ్యం లేదా ధర్మచింతన కలిగినందువల్ల, ఏదో ఒక కారణం చేత విషాదం అందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆవరిస్తుంది. ఆ సమయంలో వాళ్ళనీ వీళ్ళనీ నమ్ముకోకుండా లోపలే ఉన్న భగవంతునితో మన గోడు వెలిబుచ్చుకుంటే విషాదయోగం అవుతుంది.      


    ప్రపంచానుభవాలు వెగటనిపించినా సామాన్య మానవుడి దృష్టి పరమాత్మ వైపు మళ్ళడం కూడా కష్టమే. మొదటిసారిగా భగవంతుని వద్దకు చేరుకోవడం విషాదంగా ఉంటుంది. అందుచేత కూడా ఈ అధ్యాయాన్ని విషాదయోగం అనడం సముచితం. అయితే భగవంతుని వైపు తిరిగాడో అతని ఆధ్యాత్మిక జీవితం మొదలైనట్లే. హృదయం విచ్చుకుంటుంది. ప్రథమం అంటే విస్తరించు కోవడం, వికసించడం, "ప్రద్" అనే ధాతువునుండి వచ్చింది.      


    మొదటి అధ్యాయం భారతకథలోకి అల్లుకుపోతుంది. సంజయుడు కురుక్షేత్రంలో మొదటి పదిరోజుల యుద్ధాన్ని చూచి, భీష్ముడు పడిపోగానే ధృతరాష్ట్రునికి మొదటి నివేదికని ఇవ్వడానికి హస్తినాపురం వచ్చి ఆ విషయం తెలిపాడు.      


    ఆశ్చర్యంతో, ఆవేదనతో ధృతరాష్ట్రుడు కురుక్షేత్రంలో మొదటి నుండి యేమేమి జరిగిందో చెప్పమని అడిగాడు. ఇక్కడ నుండి భగవద్గీత మొదలు.

 

ధృతరాష్ట్ర ఉవాచ:

 

శ్లో ||  ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |

        మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ! || 1

 

తా || సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయగోరి సమావేశమైన మావాళ్ళూ, పాండవులు ఏమి చేశారు?

 

సంజయ ఉవాచ:

 

శ్లో || దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధన స్తదా |

       ఆచార్య ముపసంగమ్య రాజా వచన మబ్రవీత్ || 2

 

తా || వ్యూహంగా యేర్పరచబడివున్న పాండవసేనని  చూచి అప్పుడు దుర్యోధనుడు ఆచార్యుడైన ద్రోణులవారిని సమీపించి ఇలా పలికాడు.

 

శ్లో || పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూమ్ |

       వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా || 3

 

తా || ఆచార్యా! బుద్దిమంతుడైన మీ శిష్యుడు ధృష్టద్యుమ్నుడు చేత యేర్పరచబడిన పాండవుల యొక్క ఈ పెద్ద సైన్యాన్ని చూడండి.

 

శ్లో || అత్ర శూరా మహేష్వాసాః భీమార్జున సమాయుధి |

       యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః || 4

 

తా || ఇక్కడ శూరులూ, పెద్ద ధనస్సులు కలవాళ్ళూ, యుద్ధంలో భీమార్జునులతో దీటురాగలిగినవాళ్ళు సాత్యకి, విరాటుడు, మహారథుడు ద్రుపదుడు-ఉన్నారు.

 

శ్లో ||  ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ |

        పురుజి త్యుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః || 5

 

తా || ధృష్టకేతువు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతి భోజుడు, నరులలో శ్రేష్ఠుడైన శైబ్యుడు ఉన్నారు.

 

శ్లో || యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |

       సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః || 6

 

తా || పరాక్రమశాలి యుధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్రా కుమారుడు అభిమన్యుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. వీరందరూ మహారథులే.

 

శ్లో || అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ! |

       నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్  బ్రవీమి తే || 7

 

తా || బ్రాహ్మణోత్తమా! మనలో విశిష్టులైన వారెవరో తెలుసుకోండి. నా సైన్యంలోని నాయకుల్ని మీ గుర్తుకోసం చెబుతాను.

 

శ్లో || భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః |

       అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి  స్తథైవ చ || 8

 

తా || మీరు, భీష్ముడు, కర్ణుడు, విజయవంతుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు.

 

శ్లో || అన్యే చ బహవ శ్శూరాః మదర్థే త్యక్త జీవితాః |

       నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః || 9

 

తా || ఇంకా ఎందరో యుద్ధకోవిదులైన శూరులు, నానా శస్త్రాలను ధరించి నాకోసం జీవితాలని త్యాగం చేశారు.

 

శ్లో || అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |

       పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ || 10

 

తా || భీష్మునిచేత రక్షింపబడే మన బలం అపర్యాప్తమైనది. భీమునిచేత రక్షింపబడే వీరి ఈ బలం పర్యాప్తమైనది.

 

శ్లో || అయనేషు చ సర్వేషు యథాభాగ మవస్థితాః |

       భీష్మ మేవాభిరక్షంతు భవంత  స్సర్వ ఏవ హి || 11

 

తా || అన్ని ఎత్తుగడలలోను మీరంతా ఎవరి స్థానాల్లో వాళ్ళుంటూ, సదా భీష్ముణ్ణే రక్షించాలి.

 

శ్లో || తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః |

       సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ || 12

 

తా || అతడికి సంతోషం కలిగిస్తూ ప్రతాపవంతుడైన కురువృద్ధుడైన భీష్ముడు గట్టిగా సింహగర్జన చేసి శంఖం వూదాడు.

 

శ్లో || తతః శంఖాశ్చ  భేర్యశ్చ పణవానక గోముఖాః |

       సహసైవాభ్యహన్యంత స శబ్ద స్తుములోఽభవత్ || 13

 

తా || ఆ వెనువెంటనే శంఖాలు, భేరులు, పణవాలు (చర్యవాద్యాలు), ఆనకాలు (తప్పెటలు, మద్దేలలు), గోముఖాలు (వాద్యవిశేషాలు), ఒకేసారిగా మ్రోగాయి. ఆ ధ్వని గజిబిజి అయింది.

  

Previous                                                                                         Next


Post a Comment

Previous Post Next Post